ఒకే కంచం ఒకే మంచం!!
ఎవరైనా ఇద్దరు స్నేహితులు- ఆత్మీయులు, పరస్పరం ఆప్యాయంగా, సన్నిహితంగా ఉంటే వాళ్లిద్దరూ ఒకేకంచంలో తిని ఒకేమంచంపై పడుకుంటారు అనేవారు- పూర్వంరోజుల్లో లెండి- ఇప్పుడు ఆ మాట అంటే, అపార్ధాలు, అనవసర అర్ధాలు తీస్తారు- దానితో చాలా రాద్ధాంతం అవుతుంది.అయినా ఈ రోజుల్లో అంత నిష్కల్మషంగా ఉండే స్నేహితులు కోట్లలో ఒకళ్ళు ఉంటారేమో!
ఒకే కంచంలో తినేటప్పుడు ఎంగిలి ఉండదు అనుకుంటా-ఓహో ఎంగిలి అంటే అర్ధం తెలియని,ఎంగిలి అనే పదం తప్పు కాదు అనే లోకంలో బతుకుతున్నాం మనం అందరం ఈ రోజుల్లో;ఎప్పుడైతే ఇంగిలీషు వాడు వచ్చాడో అప్పుడే ఎంగిలి లేకుండా పోయింది.
ఒకే కంచంలో తిని పెరిగారు వాళ్ళు అని లోకం అంటుంది,లేతే పెరిగాం మేము అంటారు.చిన్న సందేహం నాకు ఆ ఎంగిలి కంచం ఎవరు కడిగి వుంటారు. ఇద్దరూ కలిశా, విడివిడిగానా, వంతుల వారీగానా!
మంచం సంగతి వచ్చేసరికి అదే సందేహం, ఎవరు మంచం వాల్చివుంటారు,ఎవరు తీసేవాళ్ళు.ఇంకో సందేహం- వాళ్ళు ఇద్దరు పెద్దఅయిన తర్వాత ఆ కంచం మరియు మంచం ఎవరు తీసుకున్నారు-మళ్ళీ వెధవ సందేహం.
ఏది అయితేనే వాళ్ళు ఎలా ఏడ్చారో మనకెందుకుగాని,నేను మాత్రం ఇలాటివాళ్ళని చాలామందిని చూసాను.వీళ్లల్లో కొద్దిమంది మాత్రం పెద్దయ్యాక కౌరవులు, పాండవులు లాగా కొట్టుకోవడం కూడా జరగటం చూసా.అదే కంచం, మంచం కోసం కాదు;ఎవరి కంచాలు, మంచాలతో బాటు జీవితంలో ఎవరివి వాళ్ళకి వచ్చేశాయి కావాల్సినవన్నీ రావాల్సినవి కూడా అహంకారం-గర్వంతోబాటు.
దీన్నే మాయరోగం అని కూడా పూర్వం పెద్దవాళ్ళు అనేవారు;మా చిన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే వినేవాళ్ళం.అంత పెద్దగా అర్ధం అయ్యేదికాదు-ఇప్పుడు బాగా తత్త్వం బోధపడుతోంది, బాధా పెడుతోంది మనం ఎరిగినవాళ్ళు కూడా ఇలా తయారవుతుంటే!
ఒకే కంచం ఒకే మంచం వాళ్ళే ఇలా తయారవుతే మిగతావాళ్ళ సంగతి గురించి చెప్పాల్సిన పనేముంది.కలియుగ మహిమ అని సరిపెట్టుకొని ఓపెద్ద నిట్టూర్పు ఇవ్వడం తప్ప మనం మాత్రం చేసేది ఏముంది!
మీరు గాని ఒకే కంచం ఒకే మంచంలా పెరిగిన వాళ్లయితే ఆ అనుభవాలు ఆ కంచం మరియూ మంచం మిత్రుల గురించి తెలియచేయండి-"మహా సిమెంట్" కన్నా ఇప్పుడు కూడా మీ స్నేహం బలంగా ఉన్నదో లేదో!